ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత.. మధ్యాహ్నం బయటకు రావొద్దని హెచ్చరిక
ఉమ్మడి జిల్లాలో ఎండలు రోజు రోజుకు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి, ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
రాబోయే మూడు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉందని, ఈ సమయంలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రజలు ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం మంచిదని సూచించారు.