CBSE రీ-వాల్యుయేషన్కు కొత్త విధానం.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని CBSE 12వ తరగతి పరీక్షల ఫలితాల రీ-వాల్యుయేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు విద్యార్థులు ముందుగా మార్కుల ధృవీకరణ (Verification) కోసం దరఖాస్తు చేసి, అనంతరం సమాధాన పత్రాల ప్రతులను పొందే విధానం అమలులో ఉండేది.
అయితే కొత్త విధానం ప్రకారం విద్యార్థులు ఇకపై ముందుగా తమ ఆన్సర్ షీట్ స్కాన్ కాపీలను పొందే అవకాశం కల్పించారు. ఆ ప్రతులను పరిశీలించిన తర్వాత మాత్రమే మార్కుల ధృవీకరణ లేదా రీ-వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
ఈ మార్పు ద్వారా విద్యార్థులకు తమ సమాధాన పత్రాలను పూర్తిగా పరిశీలించి, అవసరమైతే మాత్రమే రీ-వాల్యుయేషన్కు వెళ్లే అవకాశం లభించనుంది. దీంతో ప్రక్రియ మరింత పారదర్శకంగా, విద్యార్థి అనుకూలంగా మారుతుందని CBSE అధికారులు తెలిపారు.
విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సమయం, ఖర్చు తగ్గడంతో పాటు మూల్యాంకన ప్రక్రియపై విశ్వాసం పెరుగుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.